రామగుండం, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. భారీ వాహనాలను రహదారులపై ఇష్టారాజ్యంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో కాషన్ బోర్డులు, ముందస్తు హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆటోలు, స్కూల్ వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్సులు, స్పీడ్ గవర్నర్లు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. వాహనదారులు, డ్రైవర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరంతరం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సూచించారు. సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్‌తో పాటు ట్రాఫిక్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.