ఎన్టీపీసీ, సెప్టెంబర్ 30: యువతే దేశ భవిష్యత్తు అని, వారిలో జాతీయత, దేశభక్తి భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. అక్టోబర్ 2న రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్‌లో నిర్వహించనున్న సమతా సైనిక్ దళ్ రాష్ట్ర స్థాయి సమావేశానికి రాష్ట్ర బాడీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జిలు, ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, మిషన్, విజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే రానున్న సెమినార్లు, సామాజిక కార్యక్రమాలు, యువతలో జాతీయత–దేశభక్తి భావాలను పెంపొందించే కార్యక్రమాలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు, కార్యకర్తలు తమ సూచనలు, అభిప్రాయాలను సమావేశంలో పంచుకోవాలని కోరారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు సమతా సైనిక్ దళ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డా. మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు.

Comments 0