మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని గోదావరిఖని ప్రిన్సిపల్ కోర్టు మేజిస్ట్రేట్ వెంకట్ సచిన్ రెడ్డి ఎదుట మంగళవారం హాజరుపరిచారు.విచారణ అనంతరం నలుగురు నిందితులకు మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు. ఇందులో ముగ్గురికి రూ.10 వేల చొప్పున, మరొకరికి రూ.15 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధించగా, అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే రాంగ్ రూట్‌లో ప్రయాణించకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అతివేగానికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments 0