సింగరేణి రామగుండం-3 ఏరియా పరిధిలో బొగ్గు నాణ్యత, రవాణా అంశాలపై సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (ఓ & ఎం) మనీష్ అగర్వాల్‌తో పాటు ఇరు సంస్థల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొగ్గు సరఫరా, నాణ్యత ప్రమాణాలు, రవాణా ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు చర్చించారు. నాణ్యమైన బొగ్గును నిర్ణీత సమయంలో ఎన్టీపీసీకి రవాణా చేయడానికి పరస్పర సహకారం అవసరమని జీఎం సుంకర మధుసూదన్ పేర్కొన్నారు. సింగరేణి–ఎన్టీపీసీ మధ్య సమన్వయంతో పనిచేస్తూ బొగ్గు రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. దీనికి స్పందించిన ఎన్టీపీసీ అధికారులు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం ఎం. రామ్మోహన్, ఏరియా ఇంజనీర్ ఏ. ఉదయ భాస్కర్, నాణ్యత అధికారి ఆసిఫ్ యాసిన్, ఎన్టీపీసీ అధికారులు హేమంత్ షిండే, ప్రసాద్ మందడి, అటల్ గైక్వాడ్, రాధాకృష్ణ, దస్తగిరి, మహేష్ చమత్ తదితరులు పాల్గొన్నారు.