భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే బలిపశువుగా చేస్తున్నారన్న ఆరోపణ ఎఫ్‌ఐఆర్‌లో రూ.1 లక్ష నష్టం.. రికవరీ మాత్రం రూ.16 లక్షలు – నిష్పక్షపాత విచారణ కోరిన బాధితుడు సింగరేణి ఆర్జీ-3 ఏరియాలో చోటుచేసుకున్న డ్రాగ్‌లైన్ స్క్రాప్ చోరీ ఘటనలో భద్రతా వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు అమాయక కాంట్రాక్టర్‌ను బలిపశువుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని బాధిత కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సింగరేణి యాజమాన్యం, విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధిత కాంట్రాక్టర్ మాట్లాడుతూ, శ్రీజ ఇన్ఫ్రా సంస్థకు చెందిన సెక్యూరిటీ కాంట్రాక్ట్ 2023 మార్చి 2న ప్రారంభమై 2026 ఏప్రిల్ 15తో ముగిసిందని తెలిపారు. కాంట్రాక్ట్ ముగిసినట్లు సింగరేణి ఏరియా సెక్యూరిటీ కార్యాలయం అధికారికంగా ధృవీకరిస్తూ లేఖ జారీ చేసిందన్నారు.అయితే, కాంట్రాక్ట్ ముగిసిన ఆరు రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 21న జరిగిన డ్రాగ్‌లైన్ స్క్రాప్ చోరీ ఘటనకు తనను బాధ్యుడిగా పేర్కొంటూ రూ.16 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం చట్టబద్ధంగా, నైతికంగా సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు.చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ గార్డులు శ్రీజ ఇన్ఫ్రా సంస్థకు చెందినవారు కాదని, వారు గత ఆరు సంవత్సరాలుగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న వారేనని తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో భద్రతా బాధ్యతలు మరో కాంట్రాక్టర్ పరిధిలో ఉండగా, తమపై బాధ్యత మోపడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు.పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దొంగిలించబడిన స్క్రాప్ విలువ సుమారు రూ.1 లక్షగా నమోదై ఉండగా, ఎలాంటి విచారణ లేకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా రూ.16 లక్షల రికవరీ విధించడం ప్రశ్నార్థకమని అన్నారు.సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తన వాదనకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అన్యాయమని, సంబంధిత అధికారుల భద్రతా లోపాలను దాచిపెట్టేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.ఈ వ్యవహారంపై సింగరేణి సీఎండీ, విజిలెన్స్ విభాగం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, నిజమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, తనపై విధించిన రూ.16 లక్షల రికవరీ ఉత్తర్వులను రద్దు చేసి న్యాయం చేయాలని బాధిత కాంట్రాక్టర్ కోరారు.

Comments 0