మంథనిలో గంగపుత్ర బెస్తల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, కొబ్బరికాయ కొట్టి వేడుకలకు శుభారంభం చేశారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని భక్తి గీతాల నడుమ ప్రధాన రహదారుల మీదుగా గోదావరి తీరానికి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. డీజే సౌండ్స్‌తో పాటు డప్పు కళాకారుల మోతలు, సంప్రదాయ నృత్యాలు, గంగపుత్రుల చేపల వేట విధానాల ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి తీరంలో గంగమ్మ తల్లి, గౌరమ్మ, మత్స్యగిరీంద్రుడు, చేప, తాబేలు ప్రతిమలకు పుష్పాలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధల నడుమ ప్రతిమలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆ తరువాత గంగపుత్రులు సహపంక్తి భోజనాలు నిర్వహించి ఐక్యతను చాటారు. ఈ వేడుకల్లో మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, చల్లా నారాయణరెడ్డి పాల్గొని బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి బోనాల వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు మంథని ప్రాంత ప్రజలతో పాటు గంగపుత్రులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు గంధం వెంకటస్వామి, అంకరి ప్రకాశ్, అంబటి సతీష్, బోయిని నారాయణ, అంబటి శ్రీనివాస్, గట్టయ్య, సౌళ్ల స్వామి, అటికేటి నరేష్, అంకరి శివమురళీ, అటికేటి కోటేష్, అటికేటి శ్రావణ్, అటికేటి సాగర్, నర్సయ్య, జీదుల రాజేందర్, మోసం శంకర్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


Comments 0