మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా ‘ఈగల్’ విభాగం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు స్వయంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, ఇతరులను కూడా వాటి బారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం 100 లేదా 1908 నంబర్లకు తెలియజేయవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి సమాజ రక్షణలో భాగంగా ‘యాంటీ డ్రగ్ సోల్జర్’గా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి, ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు, కమాన్‌పూర్ ఎస్సై ప్రసాద్, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.