జనగామ గ్రామంలో బుధవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు ముగ్గురు నిరుపేద కుటుంబాల ఇండ్ల పైకప్పుల రేకులు ఎగిరిపోవడంతో తీవ్ర నష్టం సంభవించింది. జానిమియా నివాసంలోని మూడు గదుల పైకప్పు రేకులు పూర్తిగా లేచి సుమారు 200 మీటర్ల దూరంలో పడిపోయాయి. అలాగే నూకల తిరుపతి ఇంటిలో ఒక గది పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో పాటు విరిగిపోయాయి. కొంపెల్లి శ్రీనివాస్ ఇంటిలో కూడా ఒక గది పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ వెంటనే బాధిత కుటుంబాలను పరామర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వీఆర్వో సురేష్‌కు సమాచారం అందించగా, ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని నమోదు చేశారు. తదుపరి కార్పొరేటర్ శ్యామని రమేష్ తహసీల్దార్ రవీందర్‌రావును కలిసి, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన మూడు నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా తక్షణ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ రవీందర్‌రావు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబాలు ఊరట వ్యక్తం చేశాయి.

Comments 0