మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం కూచిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 40 బెస్త (మత్స్యకార) కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేసి, అర్హులైన వారికి సభ్యత్వం కల్పించాలని మత్స్యకార కుటుంబాలు కోరుతున్నాయి. చేపల పెంపకమే తమ ప్రధాన జీవనాధారమని, గ్రామంలో మత్స్యకార సహకార సంఘం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపల పెంపకానికి సంబంధించిన అవకాశాలు, ప్రభుత్వ చెరువుల నిర్వహణకు సంబంధించిన ప్రయోజనాలు అందడం లేదని వారు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కూచిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి సభ్యత్వం కల్పించాలని వారు కోరారు. అలాగే గ్రామ సమీపంలోని ప్రభుత్వ చెరువుల్లో నిబంధనల ప్రకారం చేపల పెంపకం చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మత్స్యశాఖ, సహకార శాఖ, రెవెన్యూ అధికారులతో సమగ్ర విచారణ నిర్వహించి, తమ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. 40 కుటుంబాల పేర్లు, సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించినట్లు తెలిపారు.

Comments 0