మంథని: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్ సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంథని రిషిత ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంథని సీఐ బుద్దె స్వామి, ఎస్సై మల్లయ్య ఆధ్వర్యంలో కాకతీయ హైస్కూల్, అలోక్ హైస్కూల్, మేరీ మెట్రిక్యులేషన్ స్కూల్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గురుకుల విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు యువత శారీరక, మానసిక సామర్థ్యాలను దెబ్బతీసి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, సినిమాల ప్రభావానికి లోనుకాకుండా మంచి విషయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతాయని తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు ధైర్యంగా తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.