గోదావరిఖని: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గోదావరిఖని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు, జానపద గీతాలు, చప్పట్ల సవ్వడితో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. కళాశాల చైర్మన్ డాక్టర్ రవికుమార్ నాగండ్ల, డైరెక్టర్ నాగండ్ల జమున, ప్రిన్సిపల్ ఎం. వెంకన్న, వైస్ ప్రిన్సిపల్ ఆర్. నరసింహారావు అధ్యాపకులు, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, గులాబీ తదితర పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరిన విద్యార్థినులు సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రవికుమార్ నాగండ్ల మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సంస్కృతి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యతోపాటు విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలపై అవగాహన కల్పించడం విద్యాసంస్థల బాధ్యత అని తెలిపారు. ఆధునిక యుగంలో యువత తమ మూలాలను మరచిపోకుండా తెలంగాణ వారసత్వాన్ని గౌరవించాలని సూచించారు. డైరెక్టర్ నాగండ్ల జమున మాట్లాడుతూ.. చదువుతోపాటు విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థినులు సంప్రదాయ పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను సాగనంపి, వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.



Comments 0