గోదావరిఖని: గోదావరి తీరంలో సింగరేణి గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనానికి రంగం సిద్ధమైంది. గోదావరిఖని సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న గంగపుత్ర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకే వేదికపై కలుసుకుని పరస్పర పరిచయాలు పెంపొందించుకోవడం, ఆత్మీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఐక్యతతో ముందుకు సాగడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిపై చర్చలు సమ్మేళనంలో గంగపుత్ర సమాజానికి సంబంధించిన విద్య, ఉద్యోగ అవకాశాలు, యువత భవిష్యత్‌, పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. సింగరేణి ప్రాంతంలో వివిధ రంగాల్లో స్థిరపడిన గంగపుత్ర కుటుంబాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. గంగపుత్రుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని, విద్య, ఉద్యోగాలు, సామాజిక అభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ గంగపుత్ర నాయకుడు బంగారి రాజయ్య తెలిపారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో.. బంగారి రాజయ్య, పూస వసంత్ కుమార్, అంబటి శ్రీనివాసులు, బంగారి సారంగపాణి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. గంగపుత్ర విద్యావంతుల వేదిక సమన్వయంతో జరిగే కార్యక్రమానికి గంగపుత్ర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.