రామగుండం: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బాపూజీ జీవితం పోరాటాలు, త్యాగాల సమాహారమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన, నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ బాపూజీ కీలకంగా పనిచేశారని, బీసీ, దళిత, గిరిజన ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలీ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆప్కో సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, కార్పొరేటర్లు వెంగళ బాపు, ముస్తాఫా, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, రంజిత్, అభిషేక్, పద్మశాలి సంఘం నాయకులు ఆడెపు శంకర్, బూర్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Comments 0