రాయికల్ కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు: శాశ్వత బస్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ రాయికల్ “బస్సు కోసం ఎక్కడ నిలబడాలో తెలియని పరిస్థితి. ఎండలో నిలబడలేక షాపుల ముందు కూర్చుంటున్నాం. వర్షం వస్తే మరింత ఇబ్బంది. రాయికల్ కు శాశ్వత బస్టాండ్ ఏర్పాటు చేయాలి” అని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనే ఒక ముఖ్యమైన మండలంగా, మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన రాయికల్ పట్టణంలో ఇప్పటికీ సరైన బస్టాండ్ సౌకర్యం లేకపోవడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ట్రాఫిక్ తిప్పలు.. ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యం:రాయికల్ అంగడిబజార్ ప్రధాన కూడలిలో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. అయితే, ఇక్కడ ప్రయాణికుల కోసం ఎలాంటి షెల్టర్ గానీ, కనీస వసతులు గానీ లేవు. మరోవైపు ప్రధాన రోడ్డుపైనే ప్రైవేట్ వాహనాలు, ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు రోడ్డుపైనే ఆగాల్సి వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.విద్యార్థులు, వృద్ధుల నరకయాతన:రోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు బస్సుల కోసం గంటల తరబడి రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. వేసవిలో తీవ్రమైన ఎండకు, వర్షాకాలంలో వర్షానికి తడిసి ముద్దవుతూ షాపుల ముందు, చెట్ల కింద ఆశ్రయం పొందుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం (మహాలక్ష్మి పథకం) ప్రారంభమైనప్పటి నుండి మహిళా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది, కానీ దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.స్పందించని ప్రజాప్రతినిధులు, అధికారులు:గతంలో బస్టాండ్ నిర్మాణం కోసం లక్షల రూపాయలు వెచ్చించినట్లు చెబుతున్నా, అది ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ (TGSRTC) అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి, రాయికల్ మున్సిపల్ కేంద్రంలో అన్ని వసతులతో కూడిన శాశ్వత బస్టాండ్ నిర్మించాలని, ప్రయాణికుల నీడ కోసం తక్షణమే తాత్కాలిక షెల్టర్లనైనా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.