NHRC సభ్యురాలికి నివేదికలు ఇవ్వడంలో అడ్డంకులా? నిమ్స్ వ్యవహారంపై ప్రశ్నలు హైదరాబాద్: ఖమ్మంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికల విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు శ్రీమతి విజయ భారతి నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. జూన్ 23న మధ్యాహ్నం నిమ్స్‌కు చేరుకున్న విజయ భారతి, బాలిక ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతి, వైద్య విధానాలపై నిమ్స్ డైరెక్టర్‌తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులను దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం బాలికకు సంబంధించిన పూర్తి మెడికల్ రికార్డులను కమిషన్‌కు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, నివేదికలను అందించడంలో అసాధారణ జాప్యం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, దాదాపు 45 నిమిషాల పాటు వేచి ఉంచిన అనంతరం “జిరాక్స్ కాపీలు సిద్ధం చేస్తున్నాం” అని ఆసుపత్రి అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఆలస్యంపై NHRC సభ్యురాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఆమె సిబ్బందిని సంబంధిత విభాగానికి పంపినట్లు సమాచారం. అక్కడ జరిగిన పరిణామాలు మరింత వివాదాస్పదంగా మారాయి. బాలిక మెడికల్ రిపోర్టుల్లో ఉన్న కొందరు వైద్యుల పేర్లు, ఇతర వివరాలను మార్కర్‌తో కప్పివేస్తున్నట్లు NHRC సిబ్బంది గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నించగా, వైద్యుల పేర్లు బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అలా చేస్తున్నామని ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు సమాచారం. అయితే, చికిత్స అందించిన వైద్యుల వివరాలు అధికారిక రికార్డుల్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని విజయ భారతి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పూర్తి నివేదికలను ఒక కవర్లో ఉంచి NHRC సిబ్బందికి అందించినట్లు సమాచారం. ఇక్కడితో వివాదం ముగియలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో విజయ భారతి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, నివేదికలను మరోసారి పరిశీలించాల్సి ఉందని చెబుతూ ఆసుపత్రి సిబ్బంది వాటిని తిరిగి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత నివేదికలను తిరిగి ఇవ్వాలని NHRC సభ్యురాలు ఆదేశించినప్పటికీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి అనుమతి లేకుండా ఇవ్వలేమని ఆసుపత్రి అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా NHRC సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన మొత్తం కమిషన్ దృష్టికి వెళ్లడంతో, నిమ్స్ డైరెక్టర్ వైఖరిపై NHRC తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక చికిత్సకు సంబంధించిన పూర్తి మెడికల్ రికార్డులతో ఢిల్లీలోని కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచెసి నట్లు సమాచారం . ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు…. * NHRC సభ్యురాలికి వైద్య నివేదికలు అందించడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? * రిపోర్టుల్లోని పేర్లు, వివరాలను ఎందుకు కప్పివేయాల్సి వచ్చింది? * ఒకసారి అందించిన రిపోర్టులను తిరిగి ఎందుకు తీసుకున్నారు? * కమిషన్ కోరిన సమాచారాన్ని అందించడంలో ఎవరి ఆదేశాలు అడ్డుగా నిలిచాయి? * బాధితురాలి కేసులో పారదర్శకతకు భంగం కలిగిందా? మైనర్ బాలిక ఆరోగ్య పరిస్థితి అత్యంత సున్నితమైన అంశం కావడంతో, ఈ ఆరోపణలపై నిమ్స్ యాజమాన్యం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.