జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టులో ప్రతీ పౌర్ణమి రోజున నిర్వహించే 40వ గిరిప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో 2023 ఫిబ్రవరి 5న మాఘ పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక గిరిప్రదక్షిణ పాదయాత్ర నిరాటకంగా కొనసాగుతోంది. శుక్రవారం సందర్భంగా నిర్వహించిన 40 వ గిరిప్రదక్షిణను శ్రీశ్రీశ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ గారు ఉదయం 5.30 గంటలకు ప్రారంబించారు. ఈ సందర్బంగా మహారాజ్ మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటలకే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారని, హిందువులు వారి జాగ్రత్త భవిష్యత్తు తరాల రక్షణ, ధర్మపరిరక్షణ కోసమే కలిసి ఒకటిగా నడుస్తున్నారని, దీనితో సనాతన ధర్మానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని, హిందువుల కులాలకు, రాజకీయాలకు ఆతీతంగా ఐక్యత తో ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. అనంతశక్తిశాలి అయిన శ్రీఆంజనేయ స్వామి కృప భక్తులపై ఎల్లప్పుడూ ఉండి, వారిలో ఆవహించి దేశరక్షణతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ గావించాలని కోరారు. ఈ కార్యక్రమం లో వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.