రాయికల్ పట్టణంలోని ప్రగతి విద్యాసంస్థలో బుధవారం ఎంతో అట్టహాసంగా స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలె శేఖర్ పాల్గొని... స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి, పచ్చజెండా ఊపి మార్చ్ ఫాస్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు కేవలం పతకాలు గెలవడం లేదా బహుమతులు పొందడానికే పరిమితం కావు. అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి” అని అన్నారు. విద్యార్థులు గెలిచినా, ఓడినా నిజమైన విజయం వారి ప్రయత్నం, నిబద్ధత, స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్‌లోనే ఉందని స్పష్టం చేశారు. “ఒక ఆటలో ఓటమి జీవితంలో ఓటమి కాదు. అది ఒక పాఠం మాత్రమే. ఈ రోజు మీరు నేర్చుకునే పాఠాలే రేపు మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి” అని పేర్కొన్నారు. తమ శక్తిపై నమ్మకం, లక్ష్యంపై దృష్టి ఉంటే ఏ సవాలునైనా అధిగమించవచ్చని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పడినప్పుడు మళ్లీ లేవడం నేర్చుకోవడమే నిజమైన క్రీడాకారుడి లక్షణమని వివరించారు. క్రీడా పోటీల్లో అసూయకు చోటు లేకుండా సహకారం, భయానికి బదులుగా ధైర్యం, అహంకారానికి బదులుగా వినయాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఈ రోజు మైదానంలో చూపే పట్టుదల రేపు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని తెలిపారు. చివరగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ ప్రతిభను మరియు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. “జై హో క్రీడలు! జై హో విద్యార్థులు!” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.